ప్రేమ పోయిన తర్వాత…

‘ఇది ప్రేమ కథ కాదు. ప్రేమ పోయిన కథ.’ ఇలా ముగిసే చేతన్‌ భగత్‌ నవల, ‘ద గర్ల్‌ ఇన్‌ రూమ్‌ 105’లో- కథానాయకుడైన 27 ఏళ్ళ కేశవ్, ‘చందన్‌ క్లాసెస్‌’లో బోధిస్తుంటాడు. సహోద్యోగీ, ఢిల్లీ మాలవీయ నగర్‌ ఫ్లాట్‌మేటూ అయిన సౌరభ్‌ (గోలూ) తో కలిసి, ఒక ఫిబ్రవరి రాత్రి తాగుతూ ఉంటాడు. నాలుగేళ్ళ పాత గర్ల్‌ ఫ్రెండ్, జారా పుట్టినరోజు అదేనని గుర్తుకొస్తుంది. అప్పుడే, తెల్లారి మూడు గంటలకు, జారా నుండి ‘నా పుట్టిన రోజని మరచిపోయావా! నువ్వు గుర్తుకొస్తున్నావు. రఘు మంచివాడే కానీ నాకు సరిపడినవాడు కాదు. ఇంకా, హిమాద్రి హాస్టల్లో 105వ నంబర్‌ గదిలోనే ఉన్నాను. ముందులాగే, కిటికీ బయటున్న మామిడి చెట్టెక్కి, గదిలోకొచ్చెయ్యి’ అన్న వాట్సాప్‌ మెసేజులు వస్తాయి.

గతంలో కేశవ్‌ ఢిల్లీ ఐఐటీ వదులుతుండగా, అక్కడ పీహెచ్డీ చేయడానికి వచ్చిన జారాతో ప్రేమలో పడతాడు. ఆమె కశ్మీరీ ముస్లిం. కేశవ్‌ తండ్రి రాజస్తాన్, అల్వర్‌లో- ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయినందున, అతనింటివారు వారి సంబంధాన్ని ఆమోదించరు. నవల మొదలయ్యేటప్పటికే జారా, కేశవ్‌కు దూరమై, అతని బ్యాచులోనే చదివిన తెలుగబ్బాయి రఘును పెళ్ళి చేసుకోడానికి రెండు నెలలే మిగిలుంటాయి. రఘు మల్టీనేషనల్‌ కంపెనీలో పైకి ఎదుగుతుంటాడు.

కేశవ్, సౌరభ్‌-105కి వెళ్ళేటప్పటికే జారా చనిపోయి ఉంటుంది. ఆమె మెడ నులిమిన గుర్తులు కనబడతాయి. కేశవ్‌- దగ్గర్లోనే ఉండే జారా తండ్రి సఫ్దర్‌కూ, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రానాకూ, రఘుకీ ఫోన్‌ చేసి చెప్తాడు. రఘు చెయ్యి విరిగి, హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో ఉంటాడు. హాస్టల్‌ వాచ్‌మన్‌ లక్ష్మణ్‌ రెడ్డి, హత్యా సమయమప్పుడు తన నియమితమైన చోటున లేనందువల్లా, గతంలో జారా అతనితో గొడవపడ్డమూ తెలిసి, రానా అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు. అయితే, కేశవ్‌ – గోలూ సహాయంతో, తనే డిటెక్టివ్‌ పని మొదలెడతాడు. అతని మొదటి అనుమానం- జారామీద కన్నేసిన ఆమె పీహెచ్డీ గైడయిన సక్సేనా మీదకి వెళ్తుంది. కాకపోతే, సక్సేనా కుంటుతాడు కనుక అతను చెట్టెక్కలేడని గ్రహించిన కేశవ్‌ సందేహం, తీవ్రవాదుల్లో చేరిన జారా సవతి తమ్ముడైన సికందర్‌ పైకి మళ్ళుతుంది. సికందర్‌ ఉండే కశ్మీర్‌ వెళ్లినప్పుడు, సికందర్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడున్న ఆర్మీ ఆఫీసరైన ఫెయిజ్‌ పెళ్ళయి, కవల పిల్లలున్నవాడు. ఫెయిజ్‌తో జారా సంబంధం పెట్టుకుందన్న సాక్ష్యం దొరికినప్పుడు, అతనే హంతకుడని అనుమానిస్తాడు. సఫ్దర్‌కు, జారా పోయిన వందో రోజు అందరినీ పిలవమనీ, తను హంతకుడెవరో బయటపెడతాననీ చెప్పి, రానాకూ ఫోన్‌ చేస్తాడు. అందరికీ ఆ తెలివైన హంతకుడెవరో తెలుస్తుంది.

నవల చివర్న, తను ప్రేమించిన జారా తనకు అర్థమే కాలేదని గుర్తిస్తాడు కేశవ్‌. గోలూతో కలిసి ‘జెడ్‌ డిటెక్టివ్స్‌’ అన్న ఏజెన్సీ తెరుస్తాడు. ‘నీ పిల్లలకు రఘు పోలికలు రావాలనుకుంటున్నావా – నల్లగా, అసహ్యంగా! కనీసం, కశ్మీరీల రంగు నిలబెట్టు.’ ఫెయిజ్, జారాకు పంపిన ఇలాంటి మెసేజులు, ఉత్తరాదిలో తెల్లచర్మంపట్ల ఉండే పక్షపాతాన్ని కనపరుస్తాయి.

ముస్లిమ్‌/హిందూ మతవాదాలు, కశ్మీర్‌ సమస్యలు, హత్య గురించిన టీవీ చర్చలుండే పుస్తకమంతటా, కేవలం ఢిల్లీవాసులు మాత్రమే ఉపయోగించగలిగే, యథాలాపమైన హిందీ తిట్లూ, ‘ఠర్కీ, ఆషిక్, తమీజ్, గద్దార్, పంగా’ లాంటి మాటలూ కనబడతాయి.

చేతన్‌ భగత్‌ మిగతా పుస్తకాలు- భిన్నమైన కులాల, ప్రాంతాల, సంస్కృతుల జంటలు ఆఖరికి కలిసిపోవడంతో ముగిస్తే, ఇది మాత్రం కొంచెం భిన్నంగా- ఎన్నో మలుపులతో, హత్యామర్మాన్ని ఛేదించినది. అయితే, రచయిత పుస్తకాలన్నిట్లోలాగే ఇదీ ఐఐటీ నేపథ్యంతో ఉన్నదే. సంభాషణలతోనే కొనసాగుతుంది. ఉత్తమ పురుషంలో ఉండే కథనం సరళమైన వాడుక భాషలో ఉంటుంది. ఈ నవలను 2018లో ప్రచురించినది వెస్ట్‌లాండ్‌. – యు. కృష్ణవేణి

Sakshi

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Sakshi

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis