బిజెపి విధానాలతో కీలక రంగాలు కుదేలు

* వామపక్షాల నిరసన ప్రదర్శనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
ప్రజాశక్తి- గన్నవరం:
బిజెపి ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, వ్యవసాయ, ఆటోమొబైల్‌ రంగాలు దెబ్బతింటున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన కృష్ణాజిల్లా గన్నవరంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మోడీ ఆర్థిక విధానాలు కార్పొరేట్‌ కంపెనీలకు ఉపయోగపడుతున్నాయని, రైతులు, సాధారణ ప్రజలు దివాళా తీస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఆటోమొబైల్‌రంగం నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. బిజెపి విధానాలతో కార్లు అమ్ముడుపోవడంలేదని, పెద్ద వాహనాల అమ్మకాలు తగ్గాయని తెలిపారు.
దీంతో 17 కంపెనీల్లో 10 కంపెనీలు కార్ల ఉత్పత్తిని తగ్గించాయని చెప్పారు. 12 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని తెలిపారు. మరోవైపు దేశ రక్షణ రంగంలోని 42 ఉత్పత్తి పరిశ్రమలను కేంద్రం ప్రయివేటీకరిస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతో రక్షణ రంగంలోని 42 దేశీయ పరిశ్రమలు మూత పడ్డాయని వివరించారు. రైల్వే, విమానయాన రంగాల ప్రయివేటీకరణ వల్ల నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. 27 విమానాశ్రయాలను ప్రయివేటీకరిస్తున్నారని, దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 27 ప్రభుత్వ బ్యాంకులుంటే వాటిని 12కు కుదించారన్నారు.

తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో చిన్న బ్యాంకులను, ఆంధ్రాలో ఆంధ్రా బ్యాంకుని పెద్దవాటిలో విలీనం చేస్తున్నారని, దీంతో రైతులకు పరిపతి, డిపాజిట్‌ సదుపాయాలు లేకుండా పోతాయని చెప్పారు. కార్పొరేట్లకు రాయితీలు తగ్గించాలని, రైతులకు, కూలీలకు, కార్మికులకు రాయితీలివ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కూలీలకు పనిదినాలు పెంచడంతోపాటు రూ.21 వేలు కనీస వేతనం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. కేంద్రం విధానాలకు నిరసనగా ఈనెల 16న వామపక్షాలు చేపట్టిన ప్రజాఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పుకృష్ణా కార్యదర్శి ఆర్‌.రఘు, సిపిఐ గన్నవరం సమితి కార్యదర్శి పెద్దు వాసుదేవరావు, వామపక్షాల నేతలు కళ్లం వెంకటేశ్వరరావు, టివి.లక్ష్మణస్వామి, పిల్లి మహేష్‌, కాట్రగడ్డ జోషి పాల్గొన్నారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: prajasakti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *