విద్యా, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట

* ప్రభుత్వ ఆసుపత్రుల గతిని మారుస్తాం
* జనవరి నుంచి 2000 జబ్బులకు ఆరోగ్య శ్రీ
* పక్షవాతంతో పనిచేయలేని వారికి 5000 పింఛను
* త్వరలో 108,104 వాహనాలు కొనుగోలు
*’కంటి వెలుగు’ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి జగన్‌
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి :
‘వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల గతిని పూర్తిగా మార్చివేస్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు రంగాలు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. వైద్యరంగంలో సంస్కరణలను తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడతాం.’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల తీరు అధ్వానంగా ఉందని, దీన్ని 2022 నాటికి పూర్తి స్థాయిలో మార్పుచేసి ఆధునీకరిస్తామని అన్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి గురువారం ఆయన అనంతపురం జిల్లాకు విచ్చేశారు. అనంతపురంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 5.40 కోట్ల మంది ఉంటే వారిలో 2.12 కోట్ల మంది వివిధ రకాలైన కంటి జబ్బులతో బాధపడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పథకం కింద ఆరు దశల్లో 2022 జనవరి నాటికి రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యాన్ని అందివ్వటం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరించే చర్యలు చేపట్టామన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్రను ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచి ఇస్తామన్నారు. 1200 రకాల జబ్బులకు దీని ద్వారా వైద్యం అందివ్వనున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని 2000 జబ్బులకు పెంచి ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తామన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్స పొందే అవకాశాన్ని కల్పించేందుకు ఇప్పటికే 150 ఆసుపత్రులను గుర్తించామని అన్నారు. వాటి ద్వారా వైద్యం పొందే అవకాశాన్ని కల్పించనున్నామని తెలిపారు. కిడ్నీ జబ్బులతో అత్యధిక మంది బాధపడుతున్న పలాస, మార్కాపురంలో కిడ్నా వ్యాధుల పరిశోధన కేంద్రంతో పాటు, ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కిడ్ని రోగులకు ఇప్పుడు ఇస్తున్న రూ.10 వేల తరహాలోనే ఆరోగ్య శ్రీ కింద శస్త్రచికిత్స చేసుకున్న వారు పనికి వెళ్లేంత వరకు నెలకు రూ.5000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరపున అందజేస్తామన్నారు. పక్షవాతంతో పనిచేయలేని వారికి నెలకు రూ.5000 పింఛను సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. త్వరలోనే 108 వాహనాలు 432, 104 వాహనాలు 676 వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు వివరించారు. ఏలూరులో ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసామని గుర్తుచేశారు. దీనితోపాటు పాడేరు, విజయనగరం, పులివెందుల తదితర చోట్ల కూడా వైద్యకళాశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ రకంగా వైద్యరంగంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకొచ్చి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా ఇంఛార్జీ మంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణలు పాల్గొన్నారు.

శానిటరీ నాప్కిన్‌లు ఇవ్వండి సార్‌:
వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ప్రారంభానికి ముందు ఆయన కొంత మంది విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థిని అనూష మాట్లాడుతూ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు కూడా అందజేయడం సంతోషదాయకమైన విషయమని తెలిపింది. ఇదే రకంగా ‘విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ ఇవ్వండి సార్‌… అవి లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.’ అని కోరింది. అయితే దీనిపై ముఖ్యమంత్రి తన ప్రసంగంలోనూ స్పందించకపోవడం గమనార్హం.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: prajasakti

(Visited 1 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis