అప్పటికల్లా ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది

లేదంటే రాష్ట్రపతి పాలనే… : మంత్రి

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరో వారం రోజుల తర్వాత కూడా ఇలాంటి ప్రతిష్టంభన కొనసాగితే నవంబరు 7 నుంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని భాజపా నాయకుడు, ఆర్థిక మంత్రి సుధీర్‌ ముంగతివార్‌ వెల్లడించారు. నవంబరు 8న ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు కాలం ముగియనుంది. ఎన్నికల ఫలితాలు విడుదలై ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం మంత్రి సుధీర్‌ ఓ జాతీయ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు.

”మహారాష్ట్ర ప్రజలు ఏ ఒక్క పార్టీకీ సరైన మెజారిటీ ఇవ్వలేదు.
కాబట్టి భాజపా-సేన-ఇతర పార్టీల కూటమే అధికారంలోకి రావాల్సి ఉంటుంది. మా పార్టీల మధ్య బంధం విడదీయరానిది. ఎంతగా అంటే.. ఫెవికాల్‌, అంబుజా సిమెంట్‌ అంత దృఢమైనది. నిర్దేశిత సమయమైన నవంబరు 7లోపు మహారాష్ట్రలో మా ప్రభుత్వం కొలువుదీరుతుంది. లేనిపక్షంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు.” అని అన్నారు.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పంచుకోవాలని శివసేన డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సుధీర్‌ స్పందిస్తూ.. అధికారంలో ఉండాలని భాజపా ఎలా అనుకుంటోందో.. శివసేన కూడా అదే ఆశిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంలో భాజపా వైఖరి ఇప్పటికే దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారని చెప్పారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *