బంగారాన్ని ప్రసాదంగా ఇచ్చే గుడి ఎక్కడ ఉందో తెలుసా…?

సాధారణంగా భక్తులు గుడికి వెళ్తే ప్రసాదంగా లడ్డు, కేసరి, పులిహోర, కొబ్బరినీళ్లు ఇస్తారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గుడిలో మాత్రం భక్తులకు బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాళ్వా ప్రాంతంలోని రాత్వాంలో మహాలక్ష్మీ ఆలయం ఉంది. దీపావళి పండుగ సమయంలో ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి పూజారులు బంగారం, వెండి నాణేల్ని ప్రసాదంగా ఇస్తారు.

ఈ సాంప్రదాయం ఈ గుడిలో దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. మూడురోజుల పాటు ఈ ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతాయి. దీపావళి పండుగకు ముందురోజు ఈ ఆలయంలో ధనత్రయోదశి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశవిదేశాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో ఆలయంలో జరిగే దీపావళి ఉత్సవాలకు హాజరవుతారు.
మహాలక్ష్మిని దర్శించుకుని పూజలు చేసిన భక్తులకు పూజారులు బంగారం, వెండి ఉంగరాల్ని, నాణేల్ని అందిస్తారు. కొందరు భక్తులు ఆలయంలో మూడురోజులపాటు బంగారం, వెండి కానుకల్ని ఉంచి పూజలు చేసిన అనంతరం ఇంటికి తీసుకొనివెళ్తారు. ఆలయంలోని భక్తుల కానుకల్ని కాపాడటానికి సీసీ కెమెరాలతో భారీ బందోబస్త్ చేశారు.

పూజారులు ప్రసాదంగా ఇచ్చిన బంగారం, వెండి నాణేల్ని భక్తులు ఎవరూ ఇతరులకు విక్రయించరు. ఆ నాణేలను పూజ గదిలో లేదా లాకరులో ఉంచుతారు. పూజారులు ప్రసాదంగా ఇచ్చిన నాణేల్ని దాచుకుంటే మహాలక్ష్మి తమ ఇంట్లోనే కొలువై ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలకు పైగా కానుకలు వస్తాయి.

ఇక్కడి ఆలయ పూజారులు భక్తుల నమ్మకాన్ని కాదనలేక ఈ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. భక్తులు కూడా దీపావళి పండుగ సందర్భంగా బంగారం, వెండి, డబ్బును కానుకలుగా సమర్పిస్తారు. ఈ ఆలయానికి రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు. ఆలయానికి వచ్చిన భక్తులు తమ పిల్లాపాపల్ని చల్లగా చూడాలని, సంపద వృద్ధి చెందే భాగ్యం కల్పించాలని కోరుకుంటారు.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Telugu Ap Herald