లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ సారి జరిగే సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు (NRC), వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 ముఖ్యమైన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలుకొని సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యా తదితర కీలక అంశాలకు చెందిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటు గ్రంథాలయ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి మొత్తం 37 పార్టీల్లో 27 పార్టీలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
పార్లమెంట్‌లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడం పార్లమెంటు ప్రధాన విధి అని.. నిర్మాణాత్మక చర్చల ద్వారా అధికారగణాన్ని అప్రమత్తం చేయాలన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలు జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్‌ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై విపక్ష సభ్యులు మాట్లాడారు. అయితే సభా నిబంధనలు, నియమాల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని.. అందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామన్నారు ప్రధాని.

ఇక ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 13వ తేదీ వరకు 26 రోజుల్లో 20 రోజులు కొనసాగనున్నాయి. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వర్షాకాలంలో జరిగిన తొలి సమావేశాలు విజయవంతకావడంతో.. ఈసారీ జరిగే శీతాకాల సమావేశాలు కూడా సక్సెస్ కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఇక ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా వచ్చే 70వ రాజ్యాంగ దినోత్సవం, రాజ్యసభ 250వ సమావేశ ఉత్సవాలనూ ఘనంగా నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: TV9 Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *