పసిడి పండగొచ్చే..

కరోనా వచ్చిందని కాలం ఆగదుగా.. నెల రోజులకు పైగా గడిచిన లాక్‌డౌన్‌లోనే ఉగాది, శ్రీరామనవమి జరిపేసుకున్నాం. అంతలోనే పసిడి పండగ కూడా వచ్చేసింది. అదేనండి.. అక్షయ తృతీయ. బంగారం కొనుగోళ్లకు మంగళకరంగా భావించే రోజు. మంచి రోజు సరే.. నగల షాపులు మూతపడ్డాయి. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారా..? ఈ లాక్‌డౌన్‌లోనూ గోల్డ్‌ కొనుగోలుకు ఆన్‌లైన్‌ మార్గం ఉందిగా. కరోనా కష్టాల్లోనూ కనకం కొనాలా..? వద్దా..? అని తేల్చుకోవాల్సింది మాత్రం మీరే..

ఈసారి అక్షయ తృతీయకు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లకు పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్‌తోపాటు లోహ రూపకంగానూ కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు..

ఫిజికల్‌ గోల్డ్‌

లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆన్‌లైన్‌లో లోహ రూపకంగా పసిడి కొనేందుకు అవకాశం ఉంది.
ఆభరణాలు, బిస్కెట్‌, కాయిన్స్‌ ఆర్డర్‌ చేయవచ్చు. పలు ప్రముఖ జువెలరీ బ్రాండ్లతోపాటు పలు బ్యాంకులు సైతం ఆన్‌లైన్‌ కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి. తనిష్క్‌, కల్యాణ్‌ జువెలర్స్‌, మలబార్‌, జోయాలుక్కాస్‌ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాయి. లోహం స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలుంటాయి. ఆభరణాలైతే మజూరీ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం విక్రయించాలనుకున్నప్పుడు తరుగు తీసేస్తారు. వ్యక్తిగత అవసరాల కోసమైతే లోహం కొనుగోలు చేయవచ్చు కానీ పెట్టుబడి కోసమైతే డిజిటల్‌ పథకాలే మేలు. ఎందుకంటే, లోహం కంటే డిజిటల్‌ గోల్డ్‌పైనే అధిక ప్రతిఫలం లభిస్తుంది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌

పసిడిలో పెట్టుబడులకిది మంచి ప్రత్యామ్నాయం. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎ్‌ఫ)ను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌ రేటుకు అందుబాటులో ఉంటాయి. అవసరమైనప్పుడు విక్రయించనూ వచ్చు. లాకిన్‌ పీరియడ్‌ వంటి నిబంధనలేం ఉండవు. కాకపోతే ఈటీఎ్‌ఫల క్రయవిక్రయాల కోసం డీమ్యాట్‌ అకౌంట్‌ అవసరం. పైగా ఈ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను సైతం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పసిడి బాండ్లు

డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతాయ్‌. అవసరమైతే వీటిని తాకట్టు పెట్టి రుణాలు సైతం పొందవచ్చు. బంగారు బాండ్‌ యూనిట్‌ ఒక గ్రాముతో సమానం. ఈ పథకంలో కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీ సంస్థలు 20 కిలోల వరకు కొనేందుకు వీలుంటుంది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక పెట్టుబడులను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది.

పెట్టుబడి పెట్టొచ్చా..?

కరోనా సంక్షోభ కాలంలో బంగారం మినహా ఇతర పెట్టుబడులన్నింటి (ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లు తదితరాలు) విలువలు భారీగా క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితిలో ఆదుకునే పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. అందుకే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు కుప్పకూలుతున్న తరుణంలో బంగారం మాత్రం చాలా ఎత్తుకు ఎగబాకింది. అంతర్జాతీయంగా ధర ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరువైంది. ఈ తరుణంలో పసిడిలో పెట్టుబడి పెట్టాలా..? వద్దా..? అన్నది సగటు మదుపరుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోన్న ధరలు కొంత దిద్దుబాటుకు లోనయ్యాక పెట్టుబడులు పెట్టడం మేలని కమోడిటీ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తులం ధర రూ.38,000-40,000 స్థాయికి తగ్గాక పెట్టుబడులు పెడితే దీర్ఘకాలికంగా మంచి రిటర్నులు లభించే అవకాశం ఉంటుందని ఏంజిల్‌ బ్రోకింగ్‌ కమోడిటీస్‌, కరెన్సీస్‌ డిప్యూటీ వీపీ అనూజ్‌ గుప్తా అంటున్నారు.

ఎంత మేర పెట్టుబడులు..?

రిటైల్‌ మదుపర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి ఎంత కేటాయించాలనే అంశమూ కీలకమే. బంగారంలో భారీగా లాభాలొస్తున్నాయని మొత్తం పెట్టుబడులను ఈ లోహంలోకే మళ్లించడం తగదని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. భవిష్యత్‌లో బంగారం ధరల్లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంటే పెట్టుబడులు హారతి కర్పూరంలా కరిగిపోయే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో 5-15 శాతం వరకు బంగారానికి కేటాయించవచ్చని వారు సూచిస్తున్నారు.

రేటు రయ్‌..రయ్‌!

గత ఏడాది ద్వితీయార్ధం నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో రయ్‌.. రయ్‌మంటూ ఎగబాకాయి. ఈనెల 22న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రేటు రూ.47,300కు పెరిగింది. దాంతో దేశీయంగా బంగారం సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. వారాంతం ట్రేడింగ్‌ (శుక్రవారం)లో రూ.46,500 వద్ద ముగిసింది. అంటే, గత ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే 47 శాతం పెరిగింది.

అక్షయ తృతీయ నాడు బంగారం ధరల స్థాయి

2019 – రూ.31,500

2020 – రూ.46,500

జోయాలుక్కాస్‌ ఆఫర్‌

అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్‌ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలుకు అవకాశం కల్పిస్తోంది. కస్టమర్లు అక్షయ తృతీయ రోజున జోయాలుక్కాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా పసిడి కొనవచ్చు. వీరికి బంగారంపై గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. వజ్రాభరణాలు ఆర్డర్‌ చేసేవారికి డైమండ్‌ విలువలో 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అంతేకాదు, జోయాలుక్కాస్‌ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌, వూహూ.ఇన్‌ తదితర సైట్ల ద్వారా ప్రత్యేక గిఫ్ట్‌ వోచర్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. లాక్‌డౌన్‌ ముగిసి షోరూమ్‌లు తెరుచుకున్నాక ఈ వోచర్లతో తమకు నచ్చిన నగలను కొనుగోలు చేసుకోవచ్చంటోంది.

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: Andhrajyothy

(Visited 8 times, 1 visits today)
The Logical News

FREE
VIEW
canlı bahis